20, మే 2009, బుధవారం

అంతా మన మంచికే

'అనగనగా,ఇంకా అనగా, ఇంకొంచెం అనగా , ఒక రాజు ఆ రాజుకో...'
రాజు కి కోపం వచ్చింది.
" ఎంత కధలో మనిషినైతే మాత్రం నన్ను రాజు అని తేలిగ్గా తీసిపారేయటం ఏమీ బాగోలేదు. రాజేమిటి రాజు? ఓ కోమటి లాగానో ఓ చాకలి లాగానో ? చక్రవర్తి అనో సార్వభౌముడనో అంటే నీ ప్రాణం పోతుందా?"

పోదు మహాప్రభో పోదు.
'అనగనగా ఓ ప్రభువు. ఆ ప్రభువుకో మహారాణి.'

ఈసారి మహారాణి కి కోపం వచ్చింది.
"ప్రభువుకో మహారాణి ఏమిటి. నేనేమన్నా ఓ వస్తువునా? ఆ ప్రభువు కి సంబంధించిన ఆస్తినా? ప్రభువుకో కుక్క అంటే కుక్క ఒప్పుకుంటుందేమో నేను ససేమిరా."
సరే సరే. క్షంతవ్యుడను.
'ప్రభువు, ఒక మహారాణిన్నూ. మహారాణి జన్మతః మహారాణి. అంటే ఆ దేశపు ప్రజలందరూ ఆమెను మహారాణిగా బేషరతు గా అంగీకరిస్తారన్నమాట. ఆ మాటకొస్తే ప్రభువు ని కూడా మహారాణి ఆమోదిస్తేనే ప్రజలు ఆమోదిస్తారు'.
కధలో ఈ వాక్యాన్ని రాజు రాణి కూడా ఆమోదించారు.
'రాణికి ఉంది శక్తి
రాజుకి ఉంది యుక్తి.
యువరాజు కి ఉంది ఉభయుల మీదా భక్తి.
రాణి గారి అంతరంగికులలో కొంతమందికి ఉంది కుయుక్తి.
అన్నీ తెలిసి కూడా ప్రజలకి దేశం మీదఅనురక్తి.
ఐదేళ్ళపాటు అందరికి సందిగ్ధత నించి విముక్తి.

కధ మంచికే మనం ఇంటికే.'

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి